బొగోటా, అక్టోబర్ 20: దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నైరుతి ప్రాంతంలోని నారినో ప్రావిన్స్‌లో ఉన్న అక్రమ బంగారు గనిలో కొండచరియలు విరిగిపడి 14 మంది మృతిచెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. నారినో ప్రావిన్స్‌లోని శాంటా బార్బరా డి ఇస్కువాండే మున్సిపాలిటీ పరిధిలోని గ్రామీణ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. గని వద్దకు చేరుకోవడానికి సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం, ఆ ప్రాంతంలో సాయుధ ముఠాలు ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురైనట్లు గవర్నర్ కార్యాలయం తెలిపింది. అలాగే, ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరినట్లు నారినో ప్రాంత శాంతి, భద్రతల విభాగం కార్యదర్శి అలెక్స్ గొంజాలెస్ వెల్లడించారు. గనిలో చిక్కుకున్న వారి కోసం చేపట్టిన గాలింపు చర్యలు పూర్తయ్యాయని తెలిపారు. కాగా, కొలంబియాలో అనుమతులు లేకుండా నిర్వహించే గనుల్లో ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి.